భీమేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల కమిటీ ప్రమాణ స్వీకారం
కమిటీ చైర్మన్గా పట్టపు చిన్నా బాధ్యతల స్వీకరణ... నూతన కమిటీ సభ్యులను అభినందించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము... ఆలయ సంప్రదాయాలు, పవిత్రతను కాపాడాలని సూచన...

గుడివాడ, సెప్టెంబరు 30: గుడివాడ పట్టణంలోని బంటుమిల్లి రోడ్డులో ప్రసిద్ధిగాంచిన శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థాన నూతన ధర్మకర్తల కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం రాత్రి ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సమక్షంలో నూతన కమిటీ చైర్మన్గా పట్టపు చిన్నా, ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. నూతన కమిటీ సభ్యులను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, కూటమి నాయకులు, ఆలయ అధికారులు, భక్తులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా ఎమ్మెల్యే స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన అభినందన సభలో ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ గుడివాడ ఆధ్యాత్మిక వైభవంలో శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానానికి విశిష్ట స్థానం ఉందన్నారు. చారిత్రక ప్రాశస్త్యం కలిగిన ఈ ఆలయం భక్తుల విశ్వాసానికి, ఆధ్యాత్మిక భావాలకు ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు. నూతన ధర్మకర్తల కమిటీ ఆలయ సంప్రదాయాలు, పవిత్రతను కాపాడుతూ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. దాతలు, భక్తుల భాగస్వామ్యంతో ఆలయ వైభవాన్ని మరింత పెంచేలా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. భక్తులకు మెరుగైన వసతులు కల్పించడంతోపాటు ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని కోరారు. కమిటీ సభ్యులుగా పెన్నేరు విశ్వనాథరావు, తీళ్ల సూర్యనారాయణ, దొండపాటి నాగరాజు, గేదల కళ్యాణి, వి.మాధురీలత, వై.సుశీల, మాదాల సునీత, ముప్పిడి ఉమ, పాతపాటి శ్రీవిద్య ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో కృష్ణా జిల్లా తెదేపా అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి, గుడివాడ జనసేన బాధ్యుడు బూరగడ్డ శ్రీకాంత్, దేవదాయ శాఖ పరిశీలకుడు వి.సుధాకర్, ఆలయ కార్యనిర్వహణాధికారి కందుల గోపాలరావు, కూటమి నాయకులు, దేవదాయ శాఖ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

