హోదా కాదు.. సామాజిక బాధ్యత!
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా... డివిజన్ అభివృద్ధే నా ప్రధాన లక్ష్యం... 81వ డివిజన్ కార్పొరేటర్ పందిరి నాగమణి...

పాయకాపురం, నవంబర్ 14: కార్పొరేటర్ పదవి కేవలం హోదా కాదని, ప్రజల పట్ల బాధ్యతతో పనిచేసే గొప్ప అవకాశమని 81వ డివిజన్ కార్పొరేటర్ పందిరి నాగమణి పేర్కొన్నారు. శనివారం ప్రశాంతి నగర్లోని స్పందన సేవా సమితి కార్యాలయంలో ఆమెకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పందిరి నాగమణి, వాసు దంపతులను సమితి ప్రతినిధులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని చిన్నారులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా నాగమణి మాట్లాడుతూ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు నిరంతరం కృషి చేస్తానన్నారు. ప్రజాప్రతినిధిగా గెలిపించిన 81వ డివిజన్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారంతోపాటు మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తానని స్పష్టం చేశారు. సమాజ శ్రేయస్సులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సేవా కార్యక్రమాల ద్వారా సమాజాభివృద్ధికి కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో స్పందన సేవా సమితి అధ్యక్షుడు ఇమ్మినేని ప్రసాద్, సమితి ప్రతినిధులు, స్థానికులు, చిన్నారులు పాల్గొన్నారు.

