‘జై భవానీ’ నామస్మరణతో మార్మోగిన ఇంద్రకీలాద్రి!
భవానీ దీక్షాధారులతో కిటకిటలాడిన క్యూలైన్లు.. అంతరాలయ దర్శనాలు రద్దు… భక్తులందరికీ ఉచిత దర్శన సౌకర్యం కల్పించిన ఈవో శీనా నాయక్… భక్తులకు తాగునీరు, అన్నప్రసాదాలు, ప్రత్యేక సౌకర్యాలపై అధికారుల దృష్టి…

విజయవాడ, అక్టోబర్ 25: ఇంద్రకీలాద్రి ఆదివారం భవానీ నామస్మరణతో మార్మోగింది. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానానికి వేకువజాము నుంచే భవానీ దీక్షాధారులు, సామాన్య భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీక్షా విరమణల నిమిత్తం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది భవానీలతో ఇంద్రకీలాద్రి అరుణవర్ణ శోభను సంతరించుకుంది. ‘జై భవానీ.. జైజై భవానీ’ నినాదాలతో అమ్మవారి సన్నిధి మార్మోగింది. ఉదయం నుంచే ఘాట్ రోడ్డు, కనకదుర్గ నగర్ మార్గాల ద్వారా భక్తులు పోటెత్తడంతో కొండపై క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థాన కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ ఆదేశాల మేరకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు ఉదయం నుంచే అంతరాలయ దర్శనాలను రద్దు చేశారు. మధ్యాహ్నం అమ్మవారికి మహానివేదన సమర్పించిన అనంతరం అన్ని రకాల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను రద్దు చేసి, భక్తులందరికీ ఉచిత సర్వదర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేశారు. సామాన్య భక్తులకు, భవానీ దీక్షాధారులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా దర్శన ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షించారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు తాగునీరు నిరంతరాయంగా అందించేలా చర్యలు చేపట్టారు. అన్నప్రసాదాల పంపిణీతోపాటు భక్తులకు అవసరమైన ఇతర సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా సిబ్బందిని అప్రమత్తం చేశారు. భక్తులందరూ దేవస్థాన సిబ్బంది, భద్రతా సిబ్బందికి సహకరించాలని, క్రమశిక్షణతో అమ్మవారిని దర్శించుకోవాలని ఈవో శీనా నాయక్ విజ్ఞప్తి చేశారు. భక్తుల సౌకర్యానికే తొలి ప్రాధాన్యత ఇస్తూ ఉచిత దర్శన ఏర్పాట్లు చేపట్టినట్లు దేవస్థాన వర్గాలు తెలిపాయి.

