సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై పోలీసుల ప్రత్యేక నిఘా!
ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో డీఎస్పీ విస్తృత తనిఖీలు... అత్యంత సమస్యాత్మక గ్రామాలు, పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన డీఎస్పీ శ్రీనివాసరావు... విద్యుత్, జనరేటర్లు, సీసీ కెమెరాల ఏర్పాట్లపై అధికారులకు కీలక సూచనలు...

మచిలీపట్నం, అక్టోబర్ 24 : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మచిలీపట్నం సబ్ డివిజన్ డీఎస్పీ ఏ. శ్రీనివాసరావు శనివారం పలు సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. బంటుమిల్లి మండలంలోని అర్తమూరు, పెదతుమ్మిడి, బంటుమిల్లి, చినపాండ్రాక గ్రామాలతో పాటు పెడన మండలంలోని కొంకేపూడి, పెడన పట్టణంలోని పలు వార్డులు, గూడూరు మండలంలోని ఆకుమర్రు లాకు ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యం, జనరేటర్ల ఏర్పాటు, సీసీ కెమెరాల పనితీరు తదితర మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ తనిఖీల్లో డీఎస్పీ వెంట పెడన సీఐ నాగేంద్ర ప్రసాద్, బంటుమిల్లి ఎస్సై నాగరాజు, పెడన ఎస్సై సత్యనారాయణతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

