బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం!
స్థానిక ఎన్నికల్లో బీసీలకు రాజకీయ ప్రాధాన్యం కల్పిస్తాం… రిజర్వేషన్ల అమలుకు వైసీపీ అడ్డంకులు సృష్టించింది… గన్నవరం నియోజకవర్గంలో పార్టీ పరంగా 34 శాతం అవకాశాలు…

విజయవాడ, అక్టోబర్ 11: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. శనివారం రాత్రి విజయవాడలోని తన కార్యాలయంలో నిర్వహించిన గన్నవరం నియోజకవర్గ బీసీ సెల్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలుత మహాత్మా జ్యోతిరావు పూలే, గౌతు లచ్చన్న చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం యార్లగడ్డ మాట్లాడుతూ బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవోలు జారీ చేసినప్పటికీ, వైసీపీ నాయకులు న్యాయస్థానాలను ఆశ్రయించి అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. గతవైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు రాజకీయ అవకాశాలు దూరమయ్యాయని విమర్శించారు. అప్పట్లో 34 శాతం రిజర్వేషన్లు అమలై ఉంటే సుమారు 16,800 మంది బీసీలకు స్థానిక సంస్థల్లో పదవులు చేపట్టే అవకాశం లభించేదని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీల రాజకీయ ఎదుగుదలకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గంలో పార్టీ పరంగా బీసీలకు 34 శాతం ప్రాతినిధ్యం కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బీసీలంతా ఐక్యంగా ఉండి రాజకీయ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకుడు బొప్పన భవకుమార్, నియోజకవర్గ పరిశీలకుడు ఆకుల జయసత్య, జనసేన సమన్వయకర్త చలమలశెట్టి రమేష్, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి, గన్నవరం ఏఎంసీ చైర్మన్ గూడవల్లి నరసింహారావు, బీసీ సెల్ అధ్యక్షుడు మోదుగుమూడి సత్యనారాయణతో పాటు పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.

