ప్రజా దర్బార్‌కు విశేష స్పందన.. సమస్యల పరిష్కారమే లక్ష్యం
ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో వినతులు స్వీకరించిన ఎన్డీయే నేతలు. ఇళ్ల స్థలాలు, పింఛన్లు, రేషన్ కార్డులు, వైద్య సహాయంపై ప్రజల నుంచి వినతులు. అక్కడికక్కడే పరిష్కారం.. మిగిలిన సమస్యలపై అధికారులతో సమన్వయం.

V10 TV | విజయవాడ
ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించి పాలనను ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలో ఎన్డీయే కార్యాలయంలో నిర్వహిస్తున్న 'ప్రజా దర్బార్' కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది.
ఎమ్మెల్యే ఆదేశాల మేరకు కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్‌తో పాటు మాజీ కార్పొరేటర్లు మహాదేవు అప్పాజీరావు, మహ్మద్ అబ్దుల్ ఖాదర్, 52వ డివిజన్ బీజేపీ ఇన్‌చార్జ్ అడ్డూరి భాస్కరరావు, 42వ డివిజన్ జనసేన అధ్యక్షుడు పులిచేరి రమేష్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడారు.
ఇళ్ల స్థలాలు, పింఛన్లు, వైద్య సహాయం, రేషన్ కార్డులు, స్థానిక సమస్యలపై ప్రజలు పెద్ద సంఖ్యలో వినతులు సమర్పించారు. వీటిలో చాలావరకు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించగా, మిగిలిన వాటిని సంబంధిత శాఖల ద్వారా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ మహాదేవు అప్పాజీరావు మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రజా దర్బార్ ద్వారా నేరుగా ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. అర్హులైన పేదలకు త్వరలోనే నూతన ఇళ్ల పట్టాలు, సొంతింటి స్థలాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మైనార్టీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ షర్మిల, స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు, బీజేపీ నాయకులు దుర్బేసుల హుస్సేన్, రుద్రపాటి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

