ప్రజా సమస్యల పరిష్కారమే నా లక్ష్యం: వేముల కనకదుర్గ
78వ డివిజన్‌లో ఇంటింటికీ కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికల ప్రచారం… దోమల బెడద, సైడ్ డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని హామీ… మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక కృషి చేస్తానని వెల్లడి…

విజయవాడ, అక్టోబర్ 29: డివిజన్‌లో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించడమే తన ప్రధాన లక్ష్యమని 78వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి వేముల కనకదుర్గ పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 78వ డివిజన్ షాదీఖానా ప్రాంతంలో గురువారం ఆమె విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి స్థానిక ప్రజలను కలుసుకుంటూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రానున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటు వేసి తనను కార్పొరేటర్‌గా గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా వేముల కనకదుర్గ మాట్లాడుతూ డివిజన్‌లో దోమల బెడదతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. మురుగునీటి పారుదల సక్రమంగా లేకపోవడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు సైడ్ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తానని తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యతనిస్తూ పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. ముఖ్యంగా డివిజన్‌లోని మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తానని వెల్లడించారు. యువత, మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేస్తానని స్పష్టం చేశారు. ఒక్క అవకాశం ఇచ్చి తనను ఆశీర్వదించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర కోఆర్డినేటర్ వేముల శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బత్తుల అంకమ్మరాజు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి నాగెళ్ల కిషోర్, వీకేకేసీ రాష్ట్ర కార్యదర్శి మామిడాల రమణ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వేముల దుర్గారావు, వేముల సుబ్రహ్మణ్యం, శేఖర్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.

