‘హరోం హర–శరవణభవ’ నినాదాలతో మారుమోగిన మచిలీపట్నం
▪️ కన్నులపండువగా కావడి సేవా మహోత్సవం.. భక్తి పారవశ్యంతో సాగిన ఊరేగింపు... ▪️ మేళతాళాలు, డోలు–తాశాలు, సంప్రదాయ నృత్యాలతో ఆధ్యాత్మిక శోభ... ▪️ శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు...


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
V10TV మచిలీపట్నం, ఆగస్టు 6:
మచిలీపట్నంలోని గొడుగుపేట శ్రీ సుబ్బారాయుడి వారి ఆలయంలో జరుగుతున్న 4వ ఆషాడ కృత్తిక మహోత్సవాలు భక్తిశ్రద్ధలు, ఉత్సాహాల మధ్య వైభవంగా కొనసాగుతున్నాయి. మహోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం నిర్వహించిన కావడి సేవా మహోత్సవం కన్నులపండువగా సాగింది.
మేళ వాయిద్యాలు, డోలు, తాశా, బ్యాండ్ మేళాల నడుమ మూడు స్తంభాల సెంటర్లోని వినాయకస్వామి ఆలయం నుంచి కావడి ఊరేగింపు ప్రారంభమైంది. కోనేరు సెంటర్, ఆజాద్ రోడ్డులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం మీదుగా శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం వరకు ఊరేగింపు కొనసాగింది.
‘హరోం హర.. శరవణభవ’ అంటూ భక్తులు చేసిన శరణుఘోషతో మచిలీపట్నం వీధులు మారుమోగాయి. కావడులు మోస్తున్న భక్తులు భక్తి పారవశ్యంతో నృత్యాలు చేస్తూ ముందుకు సాగగా, రోడ్డుకు ఇరువైపులా నిలిచిన భక్తులు పూలవర్షం కురిపించారు. సంప్రదాయ నృత్యాలు, వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఊరేగింపునకు ముందు శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవమూర్తులకు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. కావడులను పసుపు, కుంకుమ, పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. మార్గమధ్యలో భక్తులు కావడులకు పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు.
మచిలీపట్నంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మహిళలు మొక్కులు చెల్లించుకుంటూ కావడులకు హారతులు ఇచ్చారు.
ఆలయ ప్రధాన అర్చకులు మార్తి శివ రవితేజ శర్మ మాట్లాడుతూ.. ఆషాడ కృత్తిక సందర్భంగా స్వామివారి కృప కోసం ప్రతి ఏటా కావడి సేవా మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తులందరిపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.
ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

