ఆపన్నులకు అండగా సీఎంఆర్ఎఫ్
28 మంది లబ్ధిదారులకు రూ.13.87 లక్షల ఆర్థిక సాయం... గన్నవరం టీడీపీ కార్యాలయంలో చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే యార్లగడ్డ... పేదల వైద్యానికి ఆర్థిక ఇబ్బందులు అడ్డంకి కాకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యం...

గన్నవరం, ఆగస్టు 26: పేదలకు అవసరమైన వైద్యం అందించడంలో ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారకూడదన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అండగా నిలుస్తోందని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు.
గన్నవరం నియోజకవర్గ పరిధిలో వివిధ అనారోగ్య సమస్యలకు చికిత్స పొందిన 28 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.13.87 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను గన్నవరం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాల్లో అనారోగ్యం తలెత్తినప్పుడు వైద్య ఖర్చులు భారంగా మారుతున్నాయని పేర్కొన్నారు. అటువంటి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో భరోసానిస్తోందన్నారు. అర్హులైన బాధితులకు సీఎంఆర్ఎఫ్ సాయం అందేలా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నామని తెలిపారు.
ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు భరోసా ఇచ్చారు.
కార్యక్రమంలో నియోజకవర్గ కూటమి నాయకులు, లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

