నలుగురి వైద్యానికి రూ.16.57 లక్షల సాయం
నిరుపేదలకు వైద్య భరోసాగా ఎల్ఓసీ పత్రాలు... ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో సాయం మంజూరు... బాధిత కుటుంబాలకు పత్రాలు అందజేసిన కూటమి నేతలు...

విజయవాడ, సెప్టెంబర్ 30: నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో నలుగురు బాధితులకు రూ.16.57 లక్షల విలువైన ఎల్ఓసీ పత్రాలు మంజూరయ్యాయి. భవానీపురంలోని ఎన్డీయే కార్యాలయంలో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, కూటమి నాయకులతో కలిసి బాధిత కుటుంబాలకు పత్రాలను అందజేశారు. వించిపేటకు చెందిన మర్రి రాహుల్ ప్యాంక్రియాటైటిస్‌తో బాధపడుతూ వైద్య సహాయం కోసం దరఖాస్తు చేసుకోగా రూ.4.25 లక్షల ఎల్ఓసీ మంజూరైంది. 52వ డివిజన్‌కు చెందిన తమ్మిన రామకృష్ణ రోడ్డు ప్రమాదంలో గాయపడి కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స కోసం దరఖాస్తు చేసుకోగా రూ.3 లక్షల సాయం లభించింది. వించిపేటకు చెందిన సాయి పుండరీశ్వర్ సైనస్ సమస్య చికిత్స కోసం దరఖాస్తు చేసుకోగా రూ.3 లక్షలు, కేదారేశ్వరపేటకు చెందిన సయ్యద్ బషీర్ కాలేయ వ్యాధి చికిత్స కోసం దరఖాస్తు చేసుకోగా రూ.6.32 లక్షల విలువైన ఎల్ఓసీ పత్రాలు మంజూరయ్యాయి. తమ అభ్యర్థనలపై త్వరగా స్పందించి వైద్య సహాయం మంజూరు చేయించిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి బాధితులు, వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మహ్మద్ అబ్దుల్ ఖాదర్, స్థాయీ సంఘం మాజీ ఛైర్మన్ దాడి అప్పారావు, ఎన్టీఆర్ జిల్లా భాజపా ఉపాధ్యక్షుడు నున్న కృష్ణ, కూటమి నాయకులు దేవిన హరిప్రసాద్, రుద్రపాటి వెంకటేష్, ఆకుల రవిశంకర్ పాల్గొన్నారు.

