పేదల ఆరోగ్యానికి.. సుజనా భరోసా!
ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన... 136 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ... ప్రతి వారం వైద్య శిబిరాలతో ప్రజలకు చేరువవుతున్న సుజనా ఫౌండేషన్...

విజయవాడ, నవంబర్ 14 : పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను ఉచితంగా అందించాలనే లక్ష్యంతో సుజనా ఫౌండేషన్ నిర్వహిస్తున్న వైద్య శిబిరాలకు విశేష స్పందన లభిస్తోంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలోని సుజనా ఫౌండేషన్ ద్వారా శనివారం చిట్టినగర్ సర్కిల్ వన్ కార్యాలయం వద్ద నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో 136 మంది వైద్య సేవలు పొందారు. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ప్రతి వారం ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ శిబిరంలో కంటి, దంత వైద్య పరీక్షలతో పాటు జనరల్ ఫిజీషియన్ సేవలను అందించారు. బీపీ, షుగర్, ఈసీజీ, 2డీ ఎకో, ఎక్స్‌రే, రక్త పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన శిబిరంలో నిపుణులైన వైద్యులు 136 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన చికిత్సలు అందించారు. అనంతరం ఉచితంగా మందులను పంపిణీ చేశారు. కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడమే సుజనా ఫౌండేషన్ లక్ష్యమని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శంకర నేత్ర చికిత్సాలయ, సిద్ధార్థ డెంటల్ హాస్పిటల్, హెల్ప్ హాస్పిటల్ వైద్యులు పాల్గొని సేవలందించారు. కూటమి కార్పొరేటర్లు గుర్రం కనకదుర్గ, బెవర జోగేశ్వరరావు, నాయకులు మద్దిల రామకృష్ణ, నాగోతి రామారావు, వెంపలి గౌరీశంకర్, బీఎస్‌కే పట్నాయక్, ఎం. అప్పారావు, దేవిన హరిప్రసాద్, ధనాల శ్రీనివాసరావు, చుక్కా నరేష్, పోకల నాగబాబు, కుంబా రవి, శీలం చందు, సాయితేజ, ఆకారపు విజయకుమారి, సుజనా ఫౌండేషన్ సిబ్బంది, సుజనా మిత్ర కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.
