తీవ్ర తుపాను హెచ్చరిక.. ఐదు రోజులు హైఅలర్ట్!
సోమవారం నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం… ఐదు రోజులపాటు కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి… ప్రమాదకర హోర్డింగులను తొలగించాలి.. హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు…

ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర తుపాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా రాబోయే ఐదు రోజులపాటు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర శాఖల అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. తుపాను ప్రభావంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రమాదకర స్థితిలో ఉన్న హోర్డింగులు, ఫ్లెక్సీలు, ఇతర నిర్మాణాలను వెంటనే తొలగించాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. ప్రజల ప్రాణరక్షణకే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హోంమంత్రి అనిత అధికారులకు దిశానిర్దేశం చేశారు.

