పనితీరుతోనే ప్రజల తీర్పు మార్చాలి
ప్రభుత్వ అభివృద్ధిని ప్రజలకు వివరించాలని టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం... డెవలప్మెంట్తోనే ఓటు బ్యాంకు పెంచుకోవాలని సూచన... 2026–27లో రాష్ట్ర జీఎస్డీపీ రూ.20.35 లక్షల కోట్లకు చేరుతుందని వెల్లడి...

అమరావతి, సెప్టెంబరు 8: ప్రభుత్వంపై వచ్చే విమర్శలను సానుకూలంగా మార్చుకుని, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ శ్రేణులకు సూచించారు.
టీడీపీ లీడర్షిప్ కాంగ్రెస్ రెండో రోజు చర్చల్లో ఆయన పాల్గొని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రజల మనసులు గెలుచుకునేలా పనిచేయాలని, అభివృద్ధితోనే పార్టీకి ఓటు బ్యాంకును మరింత పెంచుకోవాలని సూచించారు.
ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరేలా పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వం చేస్తున్న పనులపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు.
2026–27 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.20.35 లక్షల కోట్లకు చేరుతుందని చంద్రబాబు పేర్కొన్నట్లు సమాచారం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యమని తెలిపారు.

