స్వాతంత్ర్య వేడుకల్లో ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్
బంటుమిల్లిలో జాతీయ జెండాను ఆవిష్కరించిన పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని పిలుపు ‘స్త్రీ శక్తి’ పథకానికి ఏడాది పూర్తి.. ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఎమ్మెల్యే

ఆగస్టు 15 – V10TV AP:బంటుమిల్లి మండలం బంటుమిల్లి గ్రామంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశ స్వాతంత్ర్యం ఎంతో మంది మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితమని పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాల్లో భారతదేశ కీర్తి ప్రతిష్ఠలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని అన్నారు. ‘స్త్రీ శక్తి’ ఉచిత బస్సు ప్రయాణ పథకానికి ఏడాది పూర్తైన సందర్భంగా బంటుమిల్లి బస్టాండ్ నుంచి ఆర్టీసీ బస్సులో ఎమ్మెల్యే ప్రయాణించారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మహిళలు 87 కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారని తెలిపారు. రోజుకు సగటున 24 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారని, ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.3,095 కోట్లు ఖర్చు చేసిందని పేర్కొన్నారు. పథకం ప్రారంభానికి ముందు ఆర్టీసీ ప్రయాణాల్లో మహిళల వాటా 40 శాతం ఉండగా, ప్రస్తుతం 62 శాతానికి పెరిగిందన్నారు. ఉద్యోగం, ఉపాధి, విద్య, వైద్యం తదితర అవసరాల కోసం మహిళలకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతోందని ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ తెలిపారు.

