ఎంవీఐ పార్వతిపై సస్పెన్షన్ వేటు
శీలానగర్ లారీ డ్రైవర్‌పై దాడి ఘటనలో రవాణా శాఖ కీలక చర్య... కాంగ్రెస్ బృందం ఫిర్యాదుకు స్పందించిన ఉన్నతాధికారులు... ఎంవీఐ పార్వతిని సస్పెండ్ చేసినట్లు వెల్లడించిన ఏపీసీసీ నేత శివాజీ...

విజయవాడ, ఆగస్టు 25: విశాఖపట్నం శీలానగర్‌లో లారీ డ్రైవర్‌పై దాడి జరిగినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ) పార్వతిని సస్పెండ్ చేసినట్లు కాంగ్రెస్ నేతలు వెల్లడించారు.
మంగళవారం ఉదయం విజయవాడ ట్రాన్స్పోర్ట్ భవన్లో అదనపు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమాదేవిని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు కొలనుకొండ శివాజీ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రతినిధి బృందం కలిసింది. శీలానగర్‌లో ఎంవీఐ పార్వతి కారు డ్రైవర్‌కు, హిందీ మాట్లాడే లారీ డ్రైవర్‌కు మధ్య జరిగిన దాడి ఘటనను ఆమె దృష్టికి తీసుకెళ్లారు.
ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి ఎంవీఐ పార్వతిపై చర్యలు తీసుకోవాలని, ఆమెను సస్పెండ్ చేయాలని ప్రతినిధి బృందం డిమాండ్ చేసినట్లు శివాజీ తెలిపారు. దీనిపై రమాదేవి సానుకూలంగా స్పందించారని, ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుని పార్వతిని సస్పెండ్ చేసినట్లు తమకు తెలియజేశారని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రతినిధులు స్వాగతించారు.
దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కారు డ్రైవర్‌పైనా కేసు నమోదు చేయించాలని కోరగా, అది రవాణా శాఖ పరిధిలోకి రాదని, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుందని అదనపు కమిషనర్ తెలిపినట్లు శివాజీ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎంకే బేగ్, నగర నాయకుడు పరశురామ్, ఐఎన్టీయూసీ మహిళా నాయకురాలు మండేపూడి సునీత, ఎస్కే జుబేదా బేగం, మునిగేటి మృదులవాణి తదితరులు పాల్గొన్నారు.

