నగరంలో దొంగల హల్‌చల్.. తాళం వేసిన ఇల్లే టార్గెట్!
వెనుక తలుపులు పెకలించి ఇంట్లోకి చొరబడిన దుండగులు రెండు బీరువాలు బద్దలు.. సామగ్రి చెల్లాచెదురు నగదు, బంగారం ఎంత పోయిందన్న దానిపై రావాల్సిన స్పష్టత

మామిడికుదురు, ఆగస్టు 21 : మామిడికుదురు మండలం నగరం మెయిన్‌రోడ్డులో అర్ధరాత్రి దొంగలు హల్‌చల్ చేశారు. గెడ్డం రామారావుకు చెందిన ఇంట్లో చోరీకి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ సభ్యులు ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తుండటంతో ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గుర్తించిన దుండగులు అదునుగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంటి వెనుక తలుపులను పెకలించి లోపలికి ప్రవేశించిన దొంగలు రెండు బీరువాలను బద్దలు కొట్టారు. ఇంట్లోని సామగ్రిని చెల్లాచెదురుగా పడేసి విలువైన వస్తువుల కోసం వెతికినట్లు కనిపిస్తోంది. శుక్రవారం పనిమనిషి ఇంటికి వచ్చి పరిశీలించగా తలుపులు ధ్వంసమై, వస్తువులు చెల్లాచెదురుగా ఉండటాన్ని గుర్తించారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నగరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంటి నుంచి ఎంత నగదు, బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయనే వివరాలు కుటుంబ సభ్యులు పరిశీలించిన అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది. దొంగలను గుర్తించేందుకు పోలీసులు ఘటనాస్థలంలో ఆధారాలను సేకరించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
