టూ టౌన్ పోలీస్ స్టేషన్ పనులు వెంటనే పూర్తి చేయాలి
నిర్మాణం మధ్యలో నిలిపివేయడం తగదు... ప్రజలు, పోలీసులకు అనుకూలంగా కొత్త భవనం అవసరం... సీపీఐ నగర కార్యదర్శి జి. కోటేశ్వరరావు డిమాండ్...

విజయవాడ, సెప్టెంబరు 7: చిట్టినగర్‌లో నిర్మాణంలో ఉన్న టూ టౌన్ పోలీస్ స్టేషన్ పనులను తక్షణమే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సీపీఐ నగర కార్యదర్శి జి. కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. చిట్టినగర్ మిల్క్ ప్రాజెక్ట్ క్వార్టర్స్ ప్రాంగణంలోని కొత్త పోలీస్ స్టేషన్ నిర్మాణ స్థలం వద్ద ఆదివారం సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ కొత్తపేటలో సుమారు 70 ఏళ్లుగా కొనసాగుతున్న టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రస్తుతం ట్రాఫిక్ రద్దీ, ఇరుకైన పరిస్థితుల మధ్య పనిచేస్తోందన్నారు. స్టేషన్ పరిధి కొత్తూరు తాడేపల్లి వరకు విస్తరించి ఉండటంతో ప్రజలు, పోలీసు సిబ్బందికి సౌకర్యంగా ఉండేలా కొత్త భవనం అత్యవసరమని పేర్కొన్నారు.
కొత్త పోలీస్ స్టేషన్ కోసం చిట్టినగర్ మిల్క్ ప్రాజెక్ట్ క్వార్టర్స్ ప్రాంగణంలో 750 గజాల స్థలాన్ని సుమారు రూ.82 లక్షలకు కొనుగోలు చేసి నిర్మాణ పనులు ప్రారంభించినట్లు తెలిపారు. అయితే రెండు స్లాబుల వరకు నిర్మాణం జరిగిన తర్వాత పనులు నిలిచిపోయాయని ఆరోపించారు.
పలుమార్లు ఆందోళనలు చేసినప్పుడల్లా కొంతమేర పనులు చేపట్టి మళ్లీ నిలిపివేస్తున్నారని విమర్శించారు. ఏళ్ల తరబడి నిర్మాణం పూర్తి కాకపోవడంతో ప్రజలకు అసౌకర్యం కలుగుతోందన్నారు. మరోవైపు ప్రస్తుతం అద్దె భవనంలో కొనసాగుతున్న పోలీస్ స్టేషన్ వర్షాకాలంలో నీటి సమస్యలను ఎదుర్కొంటోందని చెప్పారు.
ప్రభుత్వం ఇక జాప్యం చేయకుండా అవసరమైన నిధులు మంజూరు చేసి నిర్మాణాన్ని వెంటనే పునఃప్రారంభించాలని కోరారు. ఇప్పటికే రెండు స్లాబుల వరకు వచ్చిన భవనాన్ని మధ్యలోనే వదిలేయకుండా పూర్తి చేసి టూ టౌన్ పోలీస్ స్టేషన్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో నగర సహాయ కార్యదర్శి నక్క వీరభద్రరావు, తాడి పైడయ్య, కొట్టు రమణారావు, డి.వి. రమణబాబు, ఎస్కే నజీర్, ఎడ్ల కిషోర్, సింగరాజు సాంబశివరావు, కుర్ర శివకుమార్, ఆర్. పిచ్చయ్య, ఆర్. మైకల్, కరోతి వెంకటేశ్వరరావు, బోరా రామకృష్ణ, మోకా దుర్గారావు, రాయన గురునాథం, మహిళా సమాఖ్య, ఏఐవైఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

