గన్నవరంలో వైసీపీకి షాక్.. టీడీపీలోకి వంద మంది చేరిక!
ఎస్సీ కాలనీకి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తల పార్టీ మార్పు... వంద మందికి పసుపు కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే యార్లగడ్డ... స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేయాలని పిలుపు...

గన్నవరం పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన సుమారు వంద మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. శుక్రవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీకి చెందిన బత్తుల సురేష్, నిడమర్తి రాంబాబు, పొలిమేర సుధాకర్ తదితరులు తమ అనుచరులతో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, కూటమి ప్రభుత్వ పాలన పట్ల ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కొత్తగా పార్టీలో చేరిన వారంతా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. గన్నవరం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థుల విజయానికి తమవంతు సహకారం అందిస్తామని నూతనంగా చేరిన నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గూడపాటి తులసీమోహన్, కాసర్నేని రంగబాబు, కొమ్మరాజు సుధీర్, పాలడుగు నాని, తిరువీధి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

