రేపటి నుంచి విజయవాడ ఉత్సవ్–2.0
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా ప్రారంభం... స్థానిక కళాకారులకు పెద్దపీట.. సాంస్కృతిక ప్రదర్శనలకు ప్రత్యేక ప్రాధాన్యం... నగర ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని దేశవ్యాప్తంగా చాటుతాం: ఎంపీ కేశినేని చిన్ని

విజయవాడ, అక్టోబర్ 10: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలతో పాటు విజయవాడ ఉత్సవ్–2.0 నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తెలిపారు. ఆదివారం సాయంత్రం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ఉత్సవాలను ప్రారంభిస్తారని వెల్లడించారు. శనివారం విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నగర ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని దేశవ్యాప్తంగా చాటడమే ఉత్సవాల ప్రధాన లక్ష్యమన్నారు. ఆధ్యాత్మిక పర్యాటకాన్ని అభివృద్ధి చేయడంతోపాటు స్థానిక చిరు వ్యాపారులకు ఆర్థికంగా మేలు జరిగేలా కార్యక్రమాలు రూపొందించినట్లు చెప్పారు. ప్రారంభోత్సవంలో స్థానిక కళాకారులకు 45 నిమిషాలపాటు ప్రదర్శనలకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. సినీ కళాకారుల ప్రదర్శనలు, కబడ్డీ, వాలీబాల్ పోటీలు, గజరాజుల అంబారీ ప్రదర్శన వంటి ప్రత్యేక ఆకర్షణలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. మైసూరు ఉత్సవాల తరహాలో విజయవాడ ఉత్సవాలను నిర్వహించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ నెల 14న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారని, 15న జాతీయ సరస్ మేళాను ప్రారంభించనున్నారని తెలిపారు. అలాగే 13న తమిళనాడు ముఖ్యమంత్రి, 17న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పర్యటనలు షెడ్యూల్లో ఉన్నట్లు పేర్కొన్నారు. నగరానికి వచ్చే భక్తులు, పర్యాటకులను ఆకర్షించేలా వ్యాపారులు ప్రత్యేక రాయితీలు ప్రకటించాలని కోరారు.ప్రజలు తమ ఇళ్లు, వ్యాపార సముదాయాలను అలంకరించి ఉత్సవాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దసరా ఉత్సవాలు, సరస్ మేళా, విజయవాడ ఉత్సవ్–2.0ను విజయవంతం చేయాలని ఎంపీ కేశినేని చిన్ని కోరారు.

