సోషల్ మీడియా వికృతంపై వైసీపీ సమరభేరి!
జగన్, అల్లు అర్జున్ కుటుంబాలపై అసభ్య వ్యాఖ్యలు చేశారంటూ డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు... ఆధారాలిచ్చినా కేసులు పెట్టరా?.. పోలీసుల తీరుపై వెలంపల్లి ఆగ్రహం... బాధ్యులపై చర్యలు లేకుంటే న్యాయపోరాటం తప్పదని హెచ్చరిక...

విజయవాడ, నవంబర్ 14 : సోషల్ మీడియా వేదికగా మహిళలను కించపరుస్తూ, రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు సినీ నటుడు అల్లు అర్జున్ కుటుంబ సభ్యులపైనా జనసేనకు చెందిన కొందరు సోషల్ మీడియా కార్యకర్తలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ శనివారం రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. గతంలో విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఆధారాలతో ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాజకీయ విమర్శలకు హద్దులు ఉండాలని, మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడటం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. జనసేన సోషల్ మీడియా వేదికల్లో జరుగుతున్న చర్చలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయని ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యక్తిగత విషయాలపై ఎవరూ వ్యాఖ్యానించవద్దని తమ అధినేత జగన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని గుర్తుచేశారు. తాము సంయమనం పాటిస్తున్నప్పటికీ జనసేనకు చెందిన కొందరు వ్యక్తులు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని విమర్శించారు. ఆధారాలున్నా చర్యలేవీ? వైసీపీ నాయకులపై చిన్నపాటి ఫిర్యాదులు వచ్చినా వెంటనే కేసులు నమోదు చేస్తున్న పోలీసులు, తమ ఫిర్యాదుపై ఎందుకు స్పందించడం లేదని వెలంపల్లి ప్రశ్నించారు. సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా అని నిలదీశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోం మంత్రి ఈ వ్యవహారంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బెదిరింపు వ్యాఖ్యలపై విచారణ జరపాలి సామాజిక మాధ్యమాల్లో జరిగిన సంభాషణల్లో అధికార పార్టీ నాయకుల పేర్లను ప్రస్తావిస్తూ భౌతిక దాడులకు ప్రేరేపించే విధంగా వ్యాఖ్యలు చేసినట్లు తమ వద్ద ఆధారాలున్నాయని వెలంపల్లి ఆరోపించారు. ఇటువంటి వ్యాఖ్యలను తేలికగా తీసుకోవడం ప్రమాదకరమన్నారు. వాటి వెనుక ఎవరున్నారనే విషయాన్ని నిష్పక్షపాతంగా విచారించాలని కోరారు. న్యాయపోరాటానికైనా సిద్ధం! డీజీపీని స్వయంగా కలిసి ఫిర్యాదు చేయడానికి వచ్చినప్పటికీ శనివారం సెలవు కారణంగా ఆయన అందుబాటులో లేరని అధికారులు తెలిపినట్లు వెలంపల్లి పేర్కొన్నారు. దీంతో అక్కడున్న అధికారులకు వీడియో ఆధారాలతో కూడిన పెన్‌డ్రైవ్, ఫిర్యాదు పత్రాన్ని సమర్పించి రసీదు తీసుకున్నట్లు వివరించారు. తక్షణమే బాధ్యులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున న్యాయపోరాటానికి దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ టి.కల్పలత రెడ్డి, వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, సోషల్ మీడియా విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దొడ్డా అంజిరెడ్డి, గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అంకంరెడ్డి నారాయణమూర్తి, మాజీ డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

