ఇంద్రకీలాద్రిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక పూజలు మ
మహా చండీదేవి అలంకారంలో కనకదుర్గమ్మ దర్శనం… రాష్ట్రపతికి ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం… అంతరాలయంలో ఎనిమిది నిమిషాలపాటు ప్రత్యేక పూజలు…

విజయవాడ, అక్టోబర్ 14: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని సందర్శించారు. శ్రీ మహా చండీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న కనకదుర్గమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు, వేద పండితులు సంప్రదాయ ఆలయ మర్యాదలతో ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ఆలయ ప్రాంగణంలో ఉన్న భక్తులకు, క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అనంతరం అంతరాలయంలోకి ప్రవేశించిన రాష్ట్రపతి సుమారు ఎనిమిది నిమిషాలపాటు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రపతి రాక సందర్భంగా ఆలయాన్ని పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. దర్శనానంతరం ఆశీర్వచన మండపంలో వేద పండితులు రాష్ట్రపతికి వేదాశీస్సులు అందజేశారు. అమ్మవారి తీర్థప్రసాదాలను సమర్పించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి వీకే శీనానాయక్ అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించగా, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత శేషవస్త్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కార్యదర్శి కె. కన్నబాబు, కమిషనర్ కె. రామచంద్రమోహన్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

