గుడివాడ గడపల్లో ‘ఇంటింటికి టీడీపీ’
▪️ గుడివాడ 19వ వార్డులో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము విస్తృత పర్యటన... ▪️ వ్యాపారులు, కార్మికులు, స్థానికులతో మమేకం.. సమస్యలపై ఆరా... ▪️ తాగునీటి సమస్యకు కొత్త పైప్‌లైన్‌తో త్వరలో పరిష్కారం...


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
గుడివాడ, ఆగస్టు 8: ప్రజల వద్దకే వెళ్లి సమస్యలను నేరుగా తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టడమే లక్ష్యంగా గుడివాడలో ‘ఇంటింటికి టీడీపీ’ కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా శనివారం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము 19వ వార్డులో కూటమి నాయకులతో కలిసి విస్తృతంగా పర్యటించారు. బస్టాండ్ సెంటర్‌లో ఎమ్మెల్యే రాముకు కూటమి శ్రేణులు స్వాగతం పలికాయి. అనంతరం ఐఎంఏ హాల్ రోడ్డులోని వ్యాపార దుకాణాలను సందర్శించిన ఆయన వ్యాపారులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాలాజీ థియేటర్ పరిసరాల్లోని చిన్నతరహా పరిశ్రమల నిర్వాహకులు, మోటార్ మెకానిక్ గ్యారేజీల యజమానులు, కార్మికులతో మాట్లాడారు. వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. సత్యనారాయణపురం పరిసర ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లిన ఎమ్మెల్యే రాము.. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ పథకాలు,

నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. వార్డులో రోడ్ల సమస్యను పరిష్కరించినందుకు పలువురు స్థానికులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఉందని ప్రజలు ఆయన దృష్టికి తీసుకురాగా, నూతన పైప్‌లైన్ పనులు కొనసాగుతున్నాయని, అవి పూర్తయిన వెంటనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని రాము భరోసా ఇచ్చారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లడమే ‘ఇంటింటికి టీడీపీ’ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఎమ్మెల్యే రాము తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ గుడివాడ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జనసేన ఇన్‌చార్జి బూరగడ్డ శ్రీకాంత్, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్‌తో పాటు టీడీపీ, జనసేన నాయకులు, 19వ వార్డు నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.

