దేశంలో అవినీతి రాజ్యమేలుతోంది: సీపీఐ నారాయణ
రూ.28 లక్షల కోట్ల అవినీతి జరిగిందని నారాయణ ఆరోపణ గతం కంటే చంద్రబాబు పాలన దారుణంగా మారిందంటూ విమర్శ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల్లో సమూల మార్పులే లక్ష్యంగా సీపీఐ పాదయాత్ర


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఐ చేపట్టిన దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా విజయవాడలో మూడో రోజు ప్రజా ప్రచార పాదయాత్ర నిర్వహించారు. కొత్తపేట సాయిరాం థియేటర్ నుంచి నెహ్రూ బొమ్మ సెంటర్ వరకు సాగిన పాదయాత్రను సీపీఐ సీనియర్ నేత కె. నారాయణ, రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ పాలనలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. దేశంలో సుమారు రూ.28 లక్షల కోట్ల మేర అవినీతి జరిగిందని పేర్కొన్నారు. అవినీతి, అక్రమాలు, మతోన్మాదం పెరుగుతున్నాయని విమర్శించారు. దేవుడిని నమ్ముకోవడం కంటే రాజకీయ ప్రయోజనాల కోసం దేవుడి పేరును ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంపైనా

నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. గతంతో పోలిస్తే చంద్రబాబు పాలన మరింత దారుణంగా మారిందని ఆరోపిస్తూ, అభివృద్ధి పేరుతో ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చే విధానాలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. అప్పులు తెచ్చి నిర్మాణాలు చేపట్టడంపైనే కాకుండా రాష్ట్ర ఆర్థికాభివృద్ధిపైనా ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని అన్ని విభాగాల్లో మార్పు రావాలనే లక్ష్యంతోనే పాదయాత్రలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ సమగ్రాభివృద్ధికి రూ.50 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ, ఏఐటీయూసీ, మహిళా సమాఖ్య, ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
