ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు
వేకువజాము నుంచే కిటకిటలాడుతున్న దుర్గమ్మ సన్నిధి... భక్తుల రద్దీతో అంతరాలయ దర్శనం నిలిపివేత... సామాన్య భక్తులకు ప్రాధాన్యం.. క్యూలైన్లలో తాగునీటి పంపిణీ...

విజయవాడ, ఆగస్టు 9: ఆదివారం సెలవుదినం కావడంతో విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వేకువజాము నుంచే భక్తుల రద్దీ పెరగడంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అంతరాలయ దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేసిన ఆలయ అధికారులు, సామాన్య భక్తులకు త్వరితగతిన అమ్మవారి దర్శనం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అధికారులు, సిబ్బంది, పాలకమండలి సభ్యులు సమన్వయంతో దర్శన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు ఇబ్బందులు కలగకుండా తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. సిబ్బంది భక్తుల వద్దకే వెళ్లి తాగునీరు అందించేలా చర్యలు చేపట్టారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి శీన నాయక్ క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు.

