ఇన్‌స్టాగ్రామ్ పరిచయం.. రూ.10 లక్షలు స్వాహా!
చెల్లి పెళ్లి పేరుతో యువతికి మాయమాటలు చెప్పిన కేటుగాడు… నగలతో పాటు క్రెడిట్ కార్డును ర్యాపిడోలో పంపించిన బాధితురాలు… రూ.10.05 లక్షలు కోల్పోయి పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని…

హైదరాబాద్, నవంబర్ 6 : సామాజిక మాధ్యమాల్లో ఏర్పడిన పరిచయం ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిని భారీ మోసానికి గురిచేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తి మాయమాటలు నమ్మిన యువతి ఏకంగా రూ.10.05 లక్షల విలువైన నగదు, ఆభరణాలు కోల్పోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడాలో నివసిస్తూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న యువతికి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. తన స్వస్థలం నెల్లూరు అని, జూబ్లీహిల్స్‌లో సొంత ఇల్లు ఉందని చెప్పి ఆమె నమ్మకాన్ని సంపాదించాడు. కొంతకాలం పరిచయం కొనసాగిన అనంతరం తన చెల్లి వివాహం ఉందని, ఆదాయపు పన్ను శాఖ అధికారులు తన బ్యాంకు ఖాతాను స్తంభింపజేశారని నమ్మబలికాడు. చెల్లి పెళ్లికి నగలు కొనుగోలు చేసేందుకు డబ్బులు లేవని, తాత్కాలికంగా ఆమె నగలు ఇస్తే వివాహం పూర్తయిన వెంటనే తిరిగి ఇచ్చేస్తానని చెప్పాడు. అతడి మాటలు నమ్మిన యువతి తన బంగారు ఆభరణాలను ర్యాపిడో ద్వారా పంపించింది. అంతటితో ఆగని నిందితుడు తన తల్లి ఆరోగ్యం బాగోలేదని, అత్యవసరంగా క్రెడిట్ కార్డు అవసరమని మరోసారి నమ్మించాడు. దీంతో బాధితురాలు తన క్రెడిట్ కార్డును కూడా ర్యాపిడో ద్వారా పంపించింది. అనంతరం నిందితుడు అందుబాటులో లేకుండా పోవడంతో తాను మోసపోయినట్లు యువతి గుర్తించింది. ఈ వ్యవహారంలో మొత్తం రూ.10.05 లక్షలు నష్టపోయినట్లు పేర్కొంటూ పోలీసులను ఆశ్రయించింది. ఘటనపై తదుపరి దర్యాప్తు వివరాలు తెలియాల్సి ఉంది.
