చివరి రైతుకూ సాయం అందే వరకు విశ్రమించం!
తుఫాన్లతో రైతులకు తీవ్ర నష్టం.. ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధం… పంటల బీమా, పెట్టుబడి రాయితీతో రైతులకు అండగా నిలుస్తాం… నల్లమడ డ్రైన్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం: సీఎం చంద్రబాబు…

గుంటూరు, నవంబర్ 6 : అర్నబ్, మురసు తుఫాన్ల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో చివరి రైతుకు సాయం అందే వరకు ప్రభుత్వం విశ్రమించబోదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా రేటూరు వద్ద రైతులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన తుఫాను సహాయక చర్యలను వివరించారు. పంట చేతికొచ్చే సమయంలో ప్రకృతి వైపరీత్యాలు రైతులను కోలుకోలేని దెబ్బతీశాయని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలపై మురసు తుఫాను తీవ్ర ప్రభావం చూపిందన్నారు. ముందస్తు చర్యలతో భారీ నష్టాన్ని నివారించగలిగామని, పంట నష్టాన్ని పూర్తిస్థాయిలో అంచనా వేసి రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పంటల బీమాతో రైతులకు భరోసా ప్రతి రైతు తప్పనిసరిగా పంటల బీమా చేయించుకోవాలని చంద్రబాబు సూచించారు. పంటల బీమా, పెట్టుబడి రాయితీ ద్వారా నష్టపోయిన పెట్టుబడిని తిరిగి పొందే అవకాశం ఉంటుందన్నారు. ఎల్నినో ప్రభావంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్న సమయంలో పట్టిసీమ ద్వారా సాగునీరు అందించామని గుర్తుచేశారు. మంచి దిగుబడులు వస్తున్న సమయంలో తుఫాన్లు పంటలను దెబ్బతీయడం బాధాకరమన్నారు. 40 వేల విద్యుత్ స్తంభాలకు నష్టం అర్నబ్ తుఫాను కారణంగా నేలకొరిగిన 30 వేల విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించామని, మురసు తుఫాను వల్ల మరో 10 వేల స్తంభాలు దెబ్బతిన్నాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఆక్వా చెరువులకు విద్యుత్ సరఫరాను వేగంగా పునరుద్ధరిస్తున్నామని తెలిపారు. సహాయక చర్యల కోసం తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల సహకారం తీసుకుంటున్నామన్నారు. తుఫాను నష్టంపై కేంద్రానికి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నామని, ప్రధాని నరేంద్ర మోదీ కూడా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారని చెప్పారు. ప్రజా సమస్యలకే తొలి ప్రాధాన్యం ఎన్నికల కంటే ప్రజల సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనపై విమర్శలు చేస్తూ, తుఫాన్ల సమయంలో ప్రజలను ఆదుకోవడం కంటే ప్రచారానికే ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు.పరిషత్ ఎన్నికల ఫలితాల అనంతరం అన్ని విషయాలు మాట్లాడతామన్నారు. నల్లమడ డ్రైన్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తీరప్రాంతాల్లో వరద నీరు సముద్రంలో కలిసిపోతుండగా, రాయలసీమలో నీటి కొరత నెలకొందని, అందుకే నీటి భద్రత, సమర్థ నీటి నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించారు.

