విప్పర్లలో పెట్రోల్ బాంబుల కలకలం!
నామినేషన్ కేంద్రం వద్ద టీడీపీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ... ఇంటింటి తనిఖీల్లో బయటపడిన పెట్రోల్ బాంబులు, మారణాయుధాలు... అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసుల సోదాలు...

పల్నాడు, నవంబర్ 16 : పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం విప్పర్ల గ్రామంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆదివారం సర్పంచ్ పదవికి నామినేషన్లు దాఖలు చేసే విషయంలో తెలుగుదేశం పార్టీలోని రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తి ఘర్షణకు దారితీసింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి విప్పర్ల గ్రామానికి చేరుకున్నారు. ఆయన ఆధ్వర్యంలో పోలీసులు గ్రామంలో ఇంటింటా విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో భారీగా పెట్రోల్ బాంబులు, కర్రలు, ఇతర మారణాయుధాలు బయటపడటంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నామినేషన్ల సమయంలో ఇంత పెద్దఎత్తున ప్రమాదకర వస్తువులు బయటపడటం స్థానికంగా కలకలం రేపింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

