ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం!
అర్హులైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానంలోకి మారే అవకాశం... ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది... ఎల్‌ఐసీ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం: మంత్రి కొల్లు రవీంద్ర...

మచిలీపట్నం, నవంబర్ 16: ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఇన్సూరెన్స్ కార్పొరేషన్ యూనియన్, ఎంప్లాయిస్ యూనియన్ మచిలీపట్నం డివిజన్ ప్రతినిధులు మంత్రిని కలిశారు. పాత పెన్షన్ విధానం అమలుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలపై హర్షం వ్యక్తం చేస్తూ పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం వెనుకడుగు వేయదన్నారు. సీపీఎస్ రద్దు కోసం ఉద్యోగులు దశాబ్దకాలంగా పోరాటం చేస్తున్నారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా అర్హులైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానంలోకి మారేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. గత ప్రభుత్వాలు హామీలు ఇచ్చి విస్మరించాయని విమర్శించారు. ఇన్సూరెన్స్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పెన్షన్ సమస్యలను కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. నియామకాలు, విధుల్లో చేరడంలో జరిగిన జాప్యం కారణంగా ఎదురవుతున్న సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వంతో చర్చించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రాభివృద్ధికి పెట్టుబడులు, పరిశ్రమల స్థాపన అత్యంత కీలకమని మంత్రి పేర్కొన్నారు. విశాఖపట్నంలో నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో రూ.12 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా యువతకు 25 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని వివరించారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించేందుకు ఎస్క్రో ఖాతాల ఏర్పాటుపై ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ఉద్యోగుల సంక్షేమంతో పాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.

