అంబేద్కర్ గురుకులాల్లో సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
విద్యార్థులకు మెరుగైన ఆహారం, మంచినీరు, వస్త్రాలు అందించాలి... ప్రతి నెలా కలెక్టర్ పర్యవేక్షణతో పాఠశాలలు, హాస్టళ్లలో పరిశుభ్రతకు ప్రాధాన్యం... సదుపాయాల కల్పనలో ప్రభుత్వం విఫలమవుతోంది: మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజ్...

విజయవాడ: రాష్ట్రంలోని అంబేద్కర్ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజ్ డిమాండ్ చేశారు.
బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ప్రభుత్వ గురుకులాలకు అధిక నిధులు కేటాయించడంతో పాటు వాటిని సక్రమంగా ఖర్చు చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, వస్త్రాలు, స్వచ్ఛమైన తాగునీరు అందించడంతో పాటు క్రమశిక్షణతో కూడిన మెరుగైన విద్యను అందించాలన్నారు.
ప్రతి నెలా జిల్లా కలెక్టర్ స్థాయిలో గురుకుల పాఠశాలలు, హాస్టళ్లను పర్యవేక్షిస్తే వసతులు, పరిశుభ్రత మరింత మెరుగుపడతాయని పేర్కొన్నారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లల విద్యాభ్యాసంతో పాటు హాస్టల్లో అందుతున్న సదుపాయాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు.
గురుకులాల్లో అన్ని సదుపాయాలు కల్పించి, ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పుష్పరాజ్ కోరారు. బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందుబాటులోకి వస్తే మరింత మంది విద్యార్థులు చదువువైపు మొగ్గుచూపుతారని పేర్కొన్నారు.

