నవులూరు దర్గా పరిరక్షణకు ఆందోళన
మూడు శతాబ్దాల చరిత్ర కలిగిన ప్రార్థనా మందిరాన్ని కాపాడాలని డిమాండ్... రహదారి నిర్మాణానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి... నిర్ణయం మార్చుకోకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ముస్లిం సంఘాల హెచ్చరిక...

మంగళగిరి, సెప్టెంబర్ 30: మంగళగిరి నియోజకవర్గంలోని నవులూరు గ్రామం ఈఎస్ఆర్ గార్డెన్స్‌లో ఉన్న హజరత్ సయ్యద్ మాలిక్ హుస్సేన్ బాబా దర్గాను పరిరక్షించాలని కోరుతూ ముస్లిం మతపెద్దలు, సంఘాల నాయకులు, భక్తులు బుధవారం ఆందోళన నిర్వహించారు. సుమారు 300 సంవత్సరాల చరిత్ర కలిగిన దర్గాను వేగవంతమైన అనుసంధాన రహదారి నిర్మాణం కోసం తొలగించేందుకు నోటీసులు జారీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళనకారులు ఆరోపించారు. దర్గా తొలగింపు ఆలోచనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సూఫీ మతగురువు హజరత్ మొహమ్మద్ అల్తాఫ్ అలీ రజా బాబా, సూఫీ నజీరుద్దీన్ బాబా నేతృత్వంలో జరిగిన నిరసనలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాజీబాబా పాల్గొన్నారు. మతపెద్దలు, ముస్లిం సంఘాల ప్రతినిధులతో కలిసి దర్గా పరిరక్షణ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. దర్గాను తొలగించకుండా రహదారి నిర్మాణానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని అధికారులు పరిశీలించాలని నాయకులు కోరారు. చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన ప్రార్థనా స్థలాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

