రూ.3 లక్షల లంచం.. ఏసీబీ వలలో సోమశిల అధికారులు
ఎన్‌ఓసీకి రూ.3 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణ... ముగ్గురు ఇంజనీరింగ్ అధికారులు, ప్రైవేట్ కాంట్రాక్టర్ పట్టివేత... లంచం స్వీకరిస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న నెల్లూరు ఏసీబీ...

నెల్లూరు, ఆగస్టు 28: సోమశిల ప్రాజెక్టులో రూ.3 లక్షల లంచం వ్యవహారం కలకలం రేపింది. వ్యవసాయ భూమి అభివృద్ధికి అవసరమైన ఎన్‌ఓసీ జారీ విషయంలో అనుకూలంగా వ్యవహరించేందుకు రూ.3 లక్షలు డిమాండ్ చేసినట్లు వచ్చిన ఫిర్యాదుతో నెల్లూరు రేంజ్ ఏసీబీ అధికారులు ట్రాప్ నిర్వహించారు.
కలువాయి మండలం కనుపూరుపల్లి గ్రామానికి చెందిన అంబటి చిరంజీవి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు Cr.No.07/RCT-NLR/2026గా కేసు నమోదు చేశారు. సోమశిల ప్రాజెక్టుకు చెందిన జెడ్. గౌతమ్ సుమన్, ఎం. నారాయణ రాజు రూ.3 లక్షలు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఏసీబీ వివరాల ప్రకారం గురువారం సాయంత్రం సుమారు 6.10 గంటలకు సోమశిల ప్రాజెక్టు డివిజన్ నం.6 కార్యాలయంలో ట్రాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్. గౌతమ్ సుమన్, ఎం. నారాయణ రాజు, పి. మహేష్‌తో పాటు ప్రైవేట్ కాంట్రాక్టర్ సోంపల్లి మాధవ్‌ను రూ.3 లక్షల లంచం స్వీకరణ వ్యవహారంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఏసీబీ తెలిపింది.
అవినీతికి సంబంధించిన సమాచారం ఉంటే ఏసీబీ టోల్‌ఫ్రీ 1064, మొబైల్ 9440440057 ద్వారా ఫిర్యాదు చేయాలని అధికారులు కోరారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.

