విద్యార్థుల చేతుల్లో ప్రజాస్వామ్యం.. పెడన పాఠశాలలో వినూత్న ఎన్నికలు...
విద్యార్థులే రూపొందించిన ఈవీఎంలతో SPL, ASPL ఎన్నికల నిర్వహణ... నిజమైన పోలింగ్ కేంద్రాన్ని తలపించిన ఎన్నికల ప్రక్రియలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు... ఓటు హక్కు విలువ, నాయకత్వ లక్షణాలు, ప్రజాస్వామ్య స్ఫూర్తిని అలవర్చిన సెయింట్ విన్సెంట్ పల్లోటి పాఠశాల...


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
V10 TV – కృష్ణాజిల్లా, పెడన:
ప్రజాస్వామ్య విలువలను విద్యార్థులకు ఆచరణాత్మకంగా పరిచయం చేస్తూ పెడన మండలంలోని సెయింట్ విన్సెంట్ పల్లోటి పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన SPL, ASPL విద్యార్థి నాయకుల ఎన్నికలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నిజమైన పోలింగ్ కేంద్రాన్ని తలపించేలా ఓటర్ల జాబితాలు, పోలింగ్ బూత్లు, ఓటింగ్ విధానం ఏర్పాటు చేసి విద్యార్థులకు ఎన్నికల ప్రక్రియపై ప్రత్యక్ష అవగాహన కల్పించారు.
ఈ ఎన్నికల్లో అత్యంత విశేషం విద్యార్థులే స్వయంగా రూపొందించిన ఈవీఎం యంత్రాలు. భారత ఎన్నికల సంఘం వినియోగించే ఈవీఎంల నమూనాలో ఎలక్ట్రికల్ సర్క్యూట్లతో వాటిని తయారు చేసి ఓటింగ్ నిర్వహించడం అందరినీ ఆకట్టుకుంది. దీంతో ప్రజాస్వామ్యంపై అవగాహనతో పాటు సైన్స్, టెక్నాలజీ, సృజనాత్మకత పట్ల విద్యార్థుల్లో ఆసక్తి పెంపొందేలా కార్యక్రమం సాగింది.

ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించారు. ఓటు అనేది హక్కుతో పాటు బాధ్యత కూడా అనే సందేశాన్ని ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ ఫాదర్ యాకోబు మాట్లాడుతూ, నాయకత్వ లక్షణాలతో పాటు బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడానికి అవసరమైన విలువలను చిన్ననాటి నుంచే అలవర్చడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. గెలుపు–ఓటములను సమానంగా స్వీకరించడం, ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం, నిష్పక్షపాతంగా ఓటు వేయడం వంటి విలువలు భవిష్యత్ సమాజ నిర్మాణానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు.
ఈ వినూత్న నమూనా ఎన్నికల ద్వారా విద్యార్థులు పుస్తకాల్లో చదివే ప్రజాస్వామ్యాన్ని ప్రత్యక్షంగా అనుభవించే అవకాశం లభించగా, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

