ఆటో దొంగ అరెస్ట్.. పార్కింగ్ చేసిన వాహనమే టార్గెట్!
అప్సర థియేటర్ రోడ్డులో పార్కింగ్ చేసిన ఆటో చోరీ... సినిమా చూసి తిరిగొచ్చేసరికి కనిపించని ఆటో.. పోలీసులకు ఫిర్యాదు... సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడు రమేష్‌ను గుర్తించి అరెస్ట్ చేసిన పోలీసులు...

విజయవాడ క్రైమ్ ఆగస్టు 19 (ఆంధ్రప్రభ): అప్సర థియేటర్ రోడ్డులో పార్కింగ్ చేసిన ఆటోను దొంగిలించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మొగల్రాజపురానికి చెందిన ఓ వ్యక్తి ఈ నెల 17న అప్సర థియేటర్ రోడ్డుపై తన ఆటోను పార్కింగ్ చేసి సినిమా చూసేందుకు వెళ్లాడు.
సినిమా ముగిసిన అనంతరం తిరిగి వచ్చి చూడగా పార్కింగ్ చేసిన ఆటో కనిపించలేదు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దర్యాప్తు చేసిన పోలీసులు రమేష్ అనే వ్యక్తిని నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. ఆటో చోరీకి సంబంధించి మరిన్ని వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

