‘మురసు’ ముప్పుపై అప్రమత్తం.. అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు!
అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశాలు… పునరావాస కేంద్రాల ఏర్పాటుతో పాటు లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి… గ్రామ, వార్డు సచివాలయాల్లో 24 గంటలూ సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచనలు…

విజయవాడ, నవంబర్ 2: మురసు తుపాను నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అప్రమత్తం చేశారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా తక్షణమే స్పందించేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అవసరమైన చోట్ల పునరావాస కేంద్రాలను సిద్ధం చేయడంతో పాటు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. తాగునీరు, ఆహారం, వైద్యసేవలు వంటి కనీస సౌకర్యాలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. డివిజన్, మండల స్థాయిల్లో కమాండ్ కంట్రోల్ కేంద్రాలను క్రియాశీలం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజల నుంచి వచ్చే సమాచారంపై వెంటనే స్పందించేలా అధికారుల మధ్య సమన్వయం ఉండాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది 24 గంటల పాటు అందుబాటులో ఉండాలని సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని, అధికార యంత్రాంగం జారీ చేసే సూచనలను పాటించాలని కోరారు.

