26,401 పేద కుటుంబాలకు ‘పట్టాభిషేకం’
26,401 పేద కుటుంబాలకు ‘పట్టాభిషేకం’... విజయవాడలో రూ.28,112 కోట్ల విలువైన భూములపై హక్కులు... 707 ఎకరాల్లోని 34 లక్షల చదరపు గజాలకు పట్టాల పంపిణీ...


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, సెప్టెంబరు 30: రాష్ట్రంలో దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని భూ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ పేదలకు ఆస్తులపై సంపూర్ణ హక్కులు కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో బుధవారం నిర్వహించిన ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమంలో ఆయన పేద కుటుంబాలకు ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ విజయవాడలో 26,401 కుటుంబాలకు రూ.28,112 కోట్ల విలువైన భూములపై హక్కులు కల్పించినట్లు వెల్లడించారు. మొత్తం 707 ఎకరాల్లోని 34 లక్షల చదరపు గజాల స్థలాలకు పట్టాలు అందిస్తున్నామన్నారు. ఒక్కో స్థలం విలువ రూ.50 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు ఉంటుందని చెప్పారు. దశాబ్దాలుగా నివాసం ఉంటున్న పేదలకు చట్టబద్ధమైన హక్కులు కల్పించడం వారి ఆత్మగౌరవానికి ప్రభుత్వం చేస్తున్న పట్టాభిషేకమని పేర్కొన్నారు. విశాఖపట్నంలో 28 వేల మందికి, మంగళగిరిలో 5,800 కుటుంబాలకు ఇప్పటికే భూములపై హక్కులు కల్పించామని సీఎం తెలిపారు. విజయవాడ పట్టాలతో కలిపి ఇప్పటివరకు సుమారు 60 వేల పేద కుటుంబాలకు రూ.52 వేల కోట్ల విలువైన భూములను అందించినట్లు చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను భవిష్యత్తు అవసరాల కోసం లబ్ధిదారులు జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. అభివృద్ధి, సంక్షేమం, సంపద సృష్టిని సమన్వయం చేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఇప్పటికే రాష్ట్ర అభివృద్ధికి రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. వచ్చే మూడేళ్లలో రూ.35 వేల కోట్లతో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేస్తామని ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాదికి పూర్తి చేసి గ్రావిటీ ద్వారా నీటిని

అందిస్తామన్నారు. పేదలకు పింఛన్లు, అన్న క్యాంటీన్లు, ఉచిత బస్సు ప్రయాణం, వివిధ వృత్తుల వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నామని వివరించారు. ఇప్పటికే 5.5 లక్షల ఇళ్లను పూర్తిచేశామని, వచ్చే ఏడాదిలోగా మరో 5.5 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తామని ప్రకటించారు. ప్రతి పేద కుటుంబానికి ఇంటి స్థలం, ఇల్లు, తాగునీటి కుళాయి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కేంద్ర గణాంక శాఖ నివేదిక ప్రకారం మహిళా శ్రామికశక్తిలో విశాఖపట్నం అగ్రస్థానంలో నిలిచిందని సీఎం తెలిపారు. విశాఖలో ప్రతి వంద మందిలో 42 మంది, విజయవాడలో 37 మంది మహిళలు పనిచేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలు తయారుచేసే ఉత్పత్తులను ప్రత్యేక బ్రాండ్‌తో మార్కెటింగ్ చేస్తున్నామన్నారు. అమరావతిని అత్యుత్తమ, పర్యావరణహిత ప్రజా రాజధానిగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు స్పష్టం చేశారు. విజయవాడ–అమరావతి–గుంటూరు ప్రాంతాన్ని ఒకే మహానగరంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఇన్నర్, అవుటర్ రింగ్ రోడ్లు, బుల్లెట్ రైలు, నాలుగు వరుసల రైల్వే మార్గం సహా మెరుగైన రవాణా సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రతిపక్షం దుష్ప్రచారం చేస్తోందని చంద్రబాబు విమర్శించారు. లబ్ధిపొందిన ప్రజలు ప్రభుత్వ కార్యక్రమాలపై తమ అనుభవాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలని కోరారు. రాష్ట్రం ఇకపై ఎవరి వల్లా నష్టపోకుండా స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్‌తోపాటు ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

