చదువుపై ఏకాగ్రతతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
అపజయాలకు కుంగిపోకుండా లక్ష్యం వైపు సాగాలి: జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు... బాల్య వివాహాలు, పోక్సో చట్టం, 112 హెల్ప్‌లైన్‌పై విద్యార్థినులకు అవగాహన... సోషల్ మీడియాలో ‘మీ గోప్యతే మీ భద్రత’ అంటూ ఎస్పీ కీలక సూచన...


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
మచిలీపట్నం ఆగస్టు 18 (V10TV AP): విద్యార్థినులు చదువుపై ఏకాగ్రతతో, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగితే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని కృష్ణా జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ అన్నారు.
‘చైతన్యం’ కార్యక్రమంలో భాగంగా చల్లపల్లిలోని అంబేద్కర్ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలో విద్యార్థినులకు బాల్య వివాహాలు, పోక్సో చట్టం, 112 హెల్ప్‌లైన్, ఈగల్ టీమ్, శక్తి టీమ్స్ సేవలతో పాటు మహిళలు, బాలికల రక్షణకు సంబంధించిన చట్టాలపై ఎస్పీ అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా విద్యార్థినులతో ఎస్పీ మాట్లాడుతూ.. తల్లిదండ్రుల గౌరవాన్ని నిలబెట్టాలంటే జీవితంలో ఉన్నతంగా ఎదగాలని, అందుకు చదువే ప్రధాన మార్గమని చెప్పారు. ప్రస్తుతం కష్టపడి చదివి మంచి స్థాయికి చేరుకుంటే భవిష్యత్తులో తల్లిదండ్రులను గౌరవంగా చూసుకునే అవకాశం ఉంటుందన్నారు. చదువుపై పూర్తి దృష్టి కేంద్రీకరిస్తే ఇతర వ్యాపకాల ప్రభావానికి గురికాకుండా లక్ష్యాన్ని చేరుకోవచ్చన్నారు.
ఒక్కసారి విజయం సాధించామనే సంతృప్తితో ప్రయత్నాన్ని ఆపకూడదని, అత్యున్నత శిఖరాలను చేరుకోవాలంటే నిరంతర సాధన, పట్టుదల అవసరమని తెలిపారు. జీవితంలో ఎదురయ్యే అపజయాలకు నిరాశ చెందకుండా వాటి నుంచి పాఠాలు నేర్చుకుని మరింత పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు.
పరీక్షల్లో ఆశించిన ఫలితాలు రాకపోయినా, అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయినా తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని విద్యార్థినులకు హితవు పలికారు. ‘అపజయం జీవితానికి ముగింపు కాదు.. విజయానికి దారి చూపించే అనుభవం’ అని పేర్కొన్నారు. సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటూ లక్ష్యం వైపు సాగాలని సూచించారు.

సామాజిక మాధ్యమాలను ఉపయోగించే సమయంలో వ్యక్తిగత గోప్యతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్పీ సూచించారు. తెలియని వ్యక్తులకు వ్యక్తిగత సమాచారం ఇవ్వడం వల్ల ప్రమాదాల బారినపడే అవకాశం ఉందని హెచ్చరించారు. ‘మీ గోప్యతే మీ భద్రత’ అనే విషయాన్ని ప్రతి విద్యార్థిని గుర్తుంచుకోవాలన్నారు.
బాల్య వివాహాలు, పోక్సో చట్టంపై విద్యార్థినులను ప్రశ్నించి వారికి ఉన్న అవగాహనను తెలుసుకున్నారు. బాల్య వివాహాలు, బాలికలపై లైంగిక వేధింపులు లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు, గొడవలు, అల్లర్లు కనిపిస్తే ఆలస్యం చేయకుండా 112 హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.
అనంతరం విద్యార్థినుల భవిష్యత్ లక్ష్యాలను అడిగి తెలుసుకున్న ఎస్పీ, వాటిని సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమం అనంతరం గురుకుల విద్యాలయ ఆవరణలో మొక్కలు నాటి, పచ్చదనాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అవనిగడ్డ డీఎస్పీ అభిషేక్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ సత్య కిషోర్, చల్లపల్లి ఇన్‌స్పెక్టర్ ఈశ్వర్, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వరరావు, గురుకుల విద్యాలయ ప్రిన్సిపల్, అధ్యాపకులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

