స్థానిక పోరుకు సెంట్రల్ సై
29 డివిజన్లలో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ… రిజర్వేషన్లు వెలువడగానే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు… కూటమి శ్రేణులు ఐక్యంగా పనిచేయాలి: బొండా ఉమా…

విజయవాడ, అక్టోబర్ 1: స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించడమే లక్ష్యంగా పనిచేయాలని ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశమున్న నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని సూచించారు. బీఆర్‌టీఎస్ రోడ్డులోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో గురువారం సాయంత్రం బొండా ఉమా అధ్యక్షతన నియోజకవర్గంలోని 29 డివిజన్ల టీడీపీ నాయకులు, కార్యకర్తలతో విస్తృత సమావేశం నిర్వహించారు. ఎన్నికల సన్నద్ధత, డివిజన్ల వారీగా పార్టీ పరిస్థితి, కూటమి సమన్వయం, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ విజయవాడ నగరంలోని డివిజన్ల సంఖ్య 64 నుంచి 86కు పెరిగిందన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో గతంలో 21 డివిజన్లు ఉండగా, పునర్విభజన అనంతరం వాటి సంఖ్య 29కి చేరిందని తెలిపారు. డివిజన్ల రిజర్వేషన్ల వివరాలు మరో నాలుగు రోజుల్లో వెల్లడయ్యే అవకాశముందని చెప్పారు. రిజర్వేషన్లు ఖరారైన అనంతరం ప్రతి డివిజన్‌లోని నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను సేకరిస్తామని తెలిపారు. శుక్రవారం నుంచి డివిజన్ స్థాయి సమావేశాలు నిర్వహించి స్థానిక పరిస్థితులు, ప్రజాభిప్రాయం, ఆశావహుల వివరాలను తెలుసుకుంటామన్నారు. అందరి అభిప్రాయాలను సమన్వయం చేసి గెలుపు అవకాశాలున్న అభ్యర్థులను ఎంపిక చేసేలా కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు సమన్వయంతో పనిచేసి కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు. ఎన్నికల సమయంలో వర్గాలు, గ్రూపులకు తావివ్వకుండా ప్రతి ఒక్కరినీ కలుపుకొని ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు. అవసరమైతే మంత్రి నారా లోకేశ్‌ను నియోజకవర్గానికి ఆహ్వానించి పార్టీ శ్రేణులకు మరింత దిశానిర్దేశం చేయిస్తామని బొండా ఉమా పేర్కొన్నారు.

