ఆక్వా రైతులకు రూ.1.50కే విద్యుత్.. భారీ ఊరట
జీవో నంబర్ 57 విడుదలపై పాలకొల్లులో రైతు కృతజ్ఞత సభ... ఆక్వా రంగానికి కూటమి ప్రభుత్వం ‘ఆక్సిజన్’ అందించింది: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము... గుడివాడలో విద్యుత్ సబ్‌స్టేషన్లు, ఫీడర్ల ఏర్పాటుకు మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు వినతి...

పాలకొల్లు: ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్‌ను రూ.1.50కే అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 57 విడుదల చేయడంపై గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము హర్షం వ్యక్తం చేశారు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్న సీఎం చంద్రబాబుకు రైతుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వ నిర్ణయానికి కృతజ్ఞతగా పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో బుధవారం నిర్వహించిన రైతు కృతజ్ఞత బహిరంగ సభలో ఎమ్మెల్యే రాము పాల్గొన్నారు. మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, ఉపసభాపతి రఘురామకృష్ణంరాజుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు సభకు హాజరయ్యారు. మంత్రి నిమ్మల రామానాయుడు జీవో నంబర్ 57ను సభలో చదివి వినిపించగా, మంత్రులు, ఎమ్మెల్యేలు జీవో ప్రతులను ప్రదర్శించారు.
ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ.. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఆక్వా రంగానికి విద్యుత్ రాయితీ ద్వారా కూటమి ప్రభుత్వం ఆక్సిజన్ అందించినట్లయిందన్నారు. రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ వారి సమస్యలకు పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
గుడివాడలో 49 శాతం జీడీపీ ఆక్వా నుంచే
గుడివాడ నియోజకవర్గ ఆర్థిక వ్యవస్థలో ఆక్వా రంగం అత్యంత కీలకమని, నియోజకవర్గ జీడీపీలో సుమారు 49 శాతం ఆక్వా రంగం నుంచే వస్తోందని రాము తెలిపారు. విద్యుత్ సబ్సిడీతో గుడివాడ ప్రాంతంలోని ఆక్వా రైతులకు భారీ ఊరట లభిస్తుందన్నారు. రొయ్యల ధరల స్థిరీకరణకు ఆక్వా డిజిటల్ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకురావడం కూడా రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు.
సభ అనంతరం గుడివాడ నియోజకవర్గంలో రైతులు, ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త విద్యుత్ సబ్‌స్టేషన్లు, ఫీడర్లు ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు ఎమ్మెల్యే రాము వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో వివిధ జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, ఆక్వా రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

