ఈ నెల 31న వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం: నిమ్మల
సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభోత్సవం... 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు.. 23 లక్షల మందికి తాగునీరు... 10.5 టీఎంసీల కృష్ణా జలాలతో కరవు ప్రాంతాలకు ప్రయోజనం...

అమరావతి: వెలిగొండ ప్రాజెక్టును ఈ నెల 31న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన వివరాలు వెల్లడించారు.
వెలిగొండ ప్రాజెక్టు ద్వారా సుమారు 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు దాదాపు 23 లక్షల మందికి తాగునీటి సౌకర్యం కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. 10.5 టీఎంసీల కృష్ణా జలాలను కరవు ప్రభావిత ప్రాంతాలకు తరలించడం ద్వారా ఆయా ప్రాంతాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు.
ప్రాజెక్టుతో ప్రకాశం సహా కరవు ప్రభావిత ప్రాంతాల్లో సాగు, తాగునీటి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. వెలిగొండ నిర్వాసితుల సమస్యల పరిష్కారంపైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, వారికి ఇప్పటికే రూ.3 వేల కోట్లు అందించినట్లు మంత్రి వెల్లడించారు.
ఈ నెల 31న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రాజెక్టును ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని అధికారులను మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు.

