పోటీ అంటే కూటమి ప్రభుత్వానికి వణుకు: తోలేటి శ్రీకాంత్
ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడి జరిగిందంటూ ఖండన… బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్… స్థానిక ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని విజ్ఞప్తి…

విజయవాడ, అక్టోబర్ 16: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాతీర్పును ఎదుర్కొనేందుకు కూటమి ప్రభుత్వం భయపడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతివృత్తుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తోలేటి శ్రీకాంత్ విమర్శించారు. పుంగనూరులో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజే ఎంపీ మిథున్‌రెడ్డితో పాటు తమ పార్టీ నాయకులపై టీడీపీ కూటమి నాయకులు దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైందని, నిత్యావసరాల ధరల పెరుగుదలతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని శ్రీకాంత్ విమర్శించారు. ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి స్థానిక ఎన్నికల్లో ప్రతిబింబిస్తుందనే భయంతోనే దాడులు, బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టి ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. పుంగనూరు ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి, బాధ్యులను గుర్తించి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీసు యంత్రాంగం అన్ని పార్టీల పట్ల సమానంగా వ్యవహరించాలని కోరారు. అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసేందుకు భద్రత కల్పించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా ఎన్నికల అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని శ్రీకాంత్ కోరారు. అవసరమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల మద్దతుతో స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
