రామవరప్పాడులో అక్రమ డ్రెయిన్ నిర్మాణంపై రైతుల ఆందోళన
ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా మురుగు కాలువ నిర్మిస్తున్నారని ఆరోపణ... కలెక్టర్ ఆదేశాలను సైతం పట్టించుకోవడం లేదంటున్న రైతులు... డ్రైనేజీ వ్యవస్థ లేకుండా గేటెడ్ కమ్యూనిటీకి అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్న...

రామవరప్పాడు రింగ్ సమీపంలో ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా మురుగు కాలువ నిర్మిస్తున్నారంటూ స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత నిర్మాణంపై కలెక్టర్ ఆదేశాలతో అధికారులు గతంలో పనులు నిలిపివేసినప్పటికీ, రాత్రివేళల్లో తిరిగి నిర్మాణం కొనసాగిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
డ్రైనేజీ వ్యవస్థ లేకుండానే సమీపంలోని గేటెడ్ కమ్యూనిటీకి అనుమతులు ఎలా మంజూరు చేశారని రైతులు ప్రశ్నిస్తున్నారు. మురుగు నీటిని తమ ప్రాంతం వైపు మళ్లించేలా కాలువ నిర్మిస్తే భవిష్యత్తులో వ్యవసాయ భూములు, పరిసర ప్రాంతాలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్మాణానికి అవసరమైన అనుమతులు ఉన్నాయా లేదా తేల్చాలని రైతులు కోరుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నట్లు తేలితే వెంటనే నిలిపివేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

