పాఠశాల అభివృద్ధికి బుద్ధా వెంకన్న రూ.18 లక్షల చేయూత
రెండో అంతస్తు భవన అభివృద్ధికి ఆర్థిక సహాయం… సొంత నిధులతో విద్యార్థులకు వాటర్ కూలర్ ఏర్పాటు… భోజనాల కోసం ప్రత్యేక షెడ్డు నిర్మిస్తామని హామీ…

విజయవాడ, అక్టోబరు 1: విద్యాధరపురంలోని దళవాయి సుబ్బారామయ్య నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల అభివృద్ధికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బుద్ధా వెంకన్న ముందుకొచ్చారు. పాఠశాలలో రెండో అంతస్తు భవన అభివృద్ధి పనుల కోసం బుద్ధా అప్పారావు, బుద్ధా నాగాయమ్మ పేర్లతో రూ.18 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రకటించారు. విద్యార్థుల తాగునీటి అవసరాల కోసం సొంత నిధులతో వాటర్ కూలర్‌ను ఏర్పాటు చేశారు. మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులు ఇబ్బందులు పడకుండా పాఠశాల ప్రాంగణంలో ప్రత్యేక భోజన షెడ్డు నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. పాఠశాల అభివృద్ధికి సహకరించడం సంతోషంగా ఉందని, విద్యార్థుల భవిష్యత్తు కోసం చేపట్టే మరిన్ని కార్యక్రమాలకు అండగా ఉంటానని తెలిపారు. ఆయన చొరవను ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు అభినందించారు. కార్యక్రమంలో బుద్ధా నాగేశ్వరరావు, బుద్ధా సత్యనారాయణ, బుద్ధా వెంకన్న కుటుంబ సభ్యులు, మాజీ కార్పొరేటర్ గుండారపు హరిబాబు, ఆర్. లక్ష్మణ్, బి. గణేష్, సురభి బాలు, కె. శివశర్మ, కొల్లి శారద, అమర మురళి తదితరులు పాల్గొన్నారు.

