పెను ప్రమాదం తప్పింది.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంటైనర్!
సాంకేతిక సమస్యతో ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ సమీపంలో నిలిచిపోయిన బస్సు... ముందుగానే ప్రయాణికులను మరో బస్సులోకి తరలించిన డ్రైవర్.. తప్పిన ముప్పు... రోడ్డు మార్జిన్లో ఉన్న బస్సును ఢీకొట్టి వెళ్లిన కంటైనర్.. వెంబడించి పట్టుకున్న పోలీసులు...

ఏలూరు: విజయవాడ నుంచి అమలాపురం వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సుకు మార్గమధ్యంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఏలూరు జిల్లా ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ సమీపంలో బస్సు సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది.
వెంటనే అప్రమత్తమైన ఆర్టీసీ డ్రైవర్ ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చారు. బస్సులోని ప్రయాణికులను మరో ఆర్టీసీ బస్సులోకి తరలించి సురక్షితంగా గమ్యస్థానం వైపు పంపించారు. అనంతరం మరమ్మతుల కోసం బస్సును రోడ్డు మార్జిన్ వైపు నిలిపారు.
అదే సమయంలో అటుగా వచ్చిన కంటైనర్ లారీ నిలిపి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. కంటైనర్ బలంగా ఢీకొనడంతో బస్సు ప్రమాద అంచుల వరకు వెళ్లినట్లు సమాచారం. అయితే అప్పటికే ప్రయాణికులందరినీ మరో బస్సులోకి తరలించడంతో పెను ప్రమాదం తప్పింది.
ప్రమాదం అనంతరం కంటైనర్ను ఆపకుండా డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఘటనపై అధికారులు స్థానిక హైవే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు హైవే పోలీసుల సహాయంతో కంటైనర్ను పట్టుకున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

