పాతికేళ్ల భూ సమస్యకు తెర.. లోకేష్ చొరవతో శాశ్వత పరిష్కారం
మంగళగిరి ఏపీఐఐసీకి చెందిన 116.88 ఎకరాల భూములపై మంత్రివర్గం కీలక నిర్ణయం... చెరువు పోరంబోకు నుంచి అసైన్డ్ వేస్ట్ డ్రై ల్యాండ్‌గా మార్పు.. భూమి బదలాయింపునకు చట్టబద్ధత... 2003 నాటి ధరల ప్రకారం ప్రభుత్వానికి రూ.3.36 కోట్లు చెల్లించనున్న ఏపీఐఐసీ...

మంగళగిరి: పాతికేళ్ల క్రితం జరిగిన భూ రికార్డుల తప్పిదానికి మంత్రి నారా లోకేష్ చొరవతో శాశ్వత పరిష్కారం లభించింది. మంగళగిరిలో ఏపీఐఐసీకి సంబంధించిన 116.88 ఎకరాల భూములను చెరువు పోరంబోకు నుంచి అసైన్డ్ వేస్ట్ డ్రై ల్యాండ్‌గా మారుస్తూ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది.
రెవెన్యూ రికార్డుల్లో అవసరమైన మార్పులు చేయకుండానే గతంలో ఈ భూములను ఏపీఐఐసీకి కేటాయించారు. అనంతరం అక్కడ ఆటోనగర్‌తో పాటు ఐటీ, ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటయ్యాయి. ప్లాట్లు పొందిన పలువురు భవనాలు నిర్మించుకోగా, ఏపీఐఐసీ సుమారు రూ.110 కోట్లతో పది అంతస్తుల ప్రధాన కార్యాలయాన్ని కూడా నిర్మించింది. ఇదే ప్రాంతంలో టిడ్కో సముదాయం, రాజీవ్ గృహకల్పలో సుమారు 2,500 కుటుంబాలు నివసిస్తున్నాయి.
ఈ భూముల వ్యవహారంపై గతంలో మంగళగిరి మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు మున్నంగి గోపిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. సమస్య మంత్రి నారా లోకేష్ దృష్టికి రావడంతో భవిష్యత్తులో ప్రజలు, సంస్థలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపేందుకు ఆయన చొరవ తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
కోర్టు కేసు ఉపసంహరణ అనంతరం అధికారుల ద్వారా సీసీఎల్ఏకు ప్రతిపాదనలు పంపించి, అక్కడి నుంచి ప్రభుత్వ పరిశీలనకు తీసుకెళ్లారు. ఈ ప్రక్రియ అనంతరం మంత్రివర్గ సమావేశంలో 116.88 ఎకరాల భూములపై కీలక నిర్ణయం తీసుకున్నారు.
భూములను చెరువు పోరంబోకు నుంచి అసైన్డ్ వేస్ట్ డ్రై ల్యాండ్‌గా మార్చడంతో పాటు గతంలో జరిగిన భూమి బదలాయింపునకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2003 నాటి ధరల ప్రకారం ఎకరాకు రూ.2,87,375 చొప్పున మొత్తం రూ.3.36 కోట్లను ఏపీఐఐసీ ప్రభుత్వానికి చెల్లించేలా మంత్రివర్గం తీర్మానించింది.
దీంతో దాదాపు పాతికేళ్లుగా కొనసాగుతున్న భూ రికార్డుల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించినట్లయింది. మంగళగిరిలో ఇప్పటికే ఏర్పాటైన నివాస, పారిశ్రామిక సముదాయాలకు భవిష్యత్తులో భూ రికార్డులపరంగా ఇబ్బందులు తలెత్తకుండా ఈ నిర్ణయం కీలకంగా మారనుంది.

