డ్రగ్స్ వద్దు బ్రో.. నో డ్రగ్స్
గుడివాడలో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా భారీ అవగాహన ర్యాలీ... వేలాదిగా కదిలిన విద్యార్థులు, యువత.. నషా ముక్త్ భారత్‌పై విస్తృత ప్రచారం... డ్రగ్స్‌కు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దు: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు...


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
గుడివాడ, ఆగస్టు 14 (V10TV): మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా గుడివాడలో భారీ డ్రగ్స్ వ్యతిరేక అవగాహన ర్యాలీ నిర్వహించారు. ‘డ్రగ్స్ వద్దు బ్రో.. నో డ్రగ్స్’ అంటూ నినాదాలు చేస్తూ వేలాది మంది విద్యార్థులు, యువత ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఈగల్ ప్రత్యేక విభాగం, కృష్ణాజిల్లా పోలీస్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.
ర్యాలీలో ఏలూరు రేంజ్ ఐజీ జి.వి.జి. అశోక్ కుమార్, కృష్ణాజిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు, ఈగల్ ఎస్పీ జి. స్వరూప రాణితో పాటు పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏలూరు రేంజ్ ఐజీ జి.వి.జి. అశోక్ కుమార్ మాట్లాడుతూ గుడివాడలో భారీ స్థాయిలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. నషా ముక్త్ భారత్ కార్యక్రమాన్ని ప్రభుత్వం మూడు ప్రధాన విభాగాల్లో ముమ్మరంగా అమలు చేస్తోందని తెలిపారు. మాదకద్రవ్యాల నిర్మూలన విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందన్నారు. డ్రగ్స్ సరఫరా, రవాణా, విక్రయాలను అరికట్టేందుకు రాష్ట్రంలో ప్రత్యేకంగా ఈగల్ విభాగాన్ని ఏర్పాటు చేసి నిఘా కొనసాగిస్తున్నట్లు వివరించారు.

కృష్ణాజిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ యువత డ్రగ్స్‌కు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు అందించాలని ప్రజలను కోరారు.
విద్య, ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే యువత మరింత అప్రమత్తంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ మాదకద్రవ్యాల జోలికి వెళ్లవద్దని సూచించారు. డ్రగ్స్ వల్ల ఎదురయ్యే చట్టపరమైన చర్యలతో పాటు వ్యక్తిగత, కుటుంబ, సామాజిక జీవితంపై కలిగే తీవ్ర పరిణామాల గురించి ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు.

