భక్తిశ్రద్ధలతో సంతోషిమాత 17వ వార్షికోత్సవం
రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు అమ్మవారి ఆశీస్సులు పొందిన వైఎస్సార్సీపీ నేత బాజీ బాబా భక్తులకు అన్నప్రసాదాల పంపిణీ

విజయవాడ, ఆగస్టు 28: రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని లంబాడీపేట ముక్కా అప్పారావు వీధిలో కొలువై ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి, జై సంతోషిమాత అమ్మవార్ల 17వ వార్షికోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమ నిర్వాహకులు ముక్కా వెంకటరమణ, హైమావతి ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో వైఎస్సార్సీపీ రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి బాజీ బాబా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా బాజీ బాబా మాట్లాడుతూ భగవంతుడు నిర్మించిన ఈ చరాచర ప్రపంచంలో ప్రతి శుభకార్యానికి ముందు గణపతిని స్మరించుకోవడం మన సంప్రదాయమన్నారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అనే భావనతో తల్లిదండ్రులు, గురువులను గౌరవిస్తూ వారు చూపిన మంచి మార్గంలో నడవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మాజీ కార్పొరేటర్లు ఎలకల చలపతిరావు, సైకం సాయిబాబు, రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ డేరంగుల వెంకటరమణ, వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి నాగపావని, రఘు, అల్లంపూర్ణ తదితర నాయకులు పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు.

