చేనేతకు చేయూత.. హామీలన్నీ అమలు చేస్తున్నాం: సీఎం చంద్రబాబు
చేనేత కుటుంబాలకు ఏటా రూ.150 కోట్లతో ఉచిత విద్యుత్ పథకం అమలు. 85 వేల మంది చేనేత కార్మికులకు రూ.4 వేల పింఛన్.. ఏడాదికి రూ.420 కోట్ల వ్యయం. ఉప్పాడ, మంగళగిరి, అమరావతిలో చేనేత అభివృద్ధికి ప్రత్యేక ప్రాజెక్టులు ప్రకటించిన సీఎం.

V10 TV
చేనేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చేనేత కుటుంబాలకు ఏటా రూ.150 కోట్ల వ్యయంతో నెలకు 200 యూనిట్ల వరకు, పవర్‌లూమ్ యూనిట్లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు.
50 ఏళ్లు నిండిన 85 వేల మంది చేనేత కార్మికులకు నెలకు రూ.4 వేల పింఛన్ అందిస్తున్నామని, ఇందుకోసం ప్రభుత్వం ఏడాదికి రూ.420 కోట్లు ఖర్చు చేస్తోందని వెల్లడించారు.
చేనేత రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఉప్పాడలో ప్రత్యేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు, మంగళగిరిలో హ్యాండ్లూమ్ పార్కు, అమరావతి శాఖమూరులో చేనేత–హస్తకళల మ్యూజియం ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. చేనేత కళాకారుల జీవనోపాధి మెరుగుపడేలా ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.

