సంపద సృష్టి.. సంక్షేమం కూటమితోనే!
రాష్ట్ర అభివృద్ధికి సీఐఐ సదస్సు విజయమే నిదర్శనం... యువత ఉజ్వల భవిష్యత్తే ప్రభుత్వ లక్ష్యం... తూర్పు ఎమ్మెల్యే గద్దె రామమోహన్...

విజయవాడ, నవంబర్ 14: సంపద సృష్టితోపాటు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. శనివారం పటమటలోని 21వ డివిజన్ దర్శిపేట వినాయక అపార్ట్‌మెంట్ ప్రాంతంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా నిరుపేద కుటుంబానికి స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో తన సొంత నిధుల నుంచి రూ.30 వేల విలువైన బడ్డికొట్టును ఉచితంగా అందజేసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విశాఖపట్నంలో నిర్వహించిన సీఐఐ సదస్సు విజయవంతం కావడం రాష్ట్ర అభివృద్ధికి నిదర్శనమన్నారు. దేశవిదేశాల పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. సుమారు రూ.9 లక్షల కోట్ల పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ నాయకత్వంపై ఉన్న నమ్మకమే పెట్టుబడుల ఆకర్షణకు కారణమన్నారు. పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, పేద, మధ్యతరగతి కుటుంబాల ఆదాయాలు మెరుగుపడతాయని చెప్పారు. గత వైసీపీ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో పలు పథకాలు, కాంట్రాక్టుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా వినియోగించుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల సమన్వయంతో సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నూతన కార్పొరేటర్ గరిగపాటి శ్రీనివాసరావు, కర్ణా రమేష్, ముమ్మనేని ప్రసాద్, కర్ణా కోటేశ్వరరావు, యడ్లపల్లి నాగరాజు, డాంగె కుమారి, కుమార భవ్య, పోతంశెట్టి నాగేశ్వరరావు, మొహమ్మద్ శిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

