రైతులకు భరోసాగా నూతన పట్టాదారు పాసు పుస్తకాలు
ప్రభుత్వ రాజముద్రతో రైతులకు పాసు పుస్తకాల పంపిణీ రీ-సర్వేతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం: ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ రైతుల భూములకు భద్రత, హక్కులకు రక్షణే కూటమి ప్రభుత్వ లక్ష్యం

మచిలీపట్నం, ఆగస్టు 14 (V10TV): పెడన మండలం లంకలకలవగుంట గ్రామంలో రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పాల్గొని రైతులకు పాసు పుస్తకాలను అందజేశారు.
ఈ సందర్భంగా కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో భూములకు సంబంధించి ఏర్పడిన సమస్యలను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రీ-సర్వే ప్రక్రియకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.
రీ-సర్వే ద్వారా భూ వివాదాలకు పరిష్కారం లభించడంతో పాటు ప్రభుత్వ రాజముద్రతో అందిస్తున్న నూతన పట్టాదారు పాసు పుస్తకాలు రైతులకు భరోసా కల్పిస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో బ్యాంకు రుణాలు పొందేందుకు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేందుకు ఈ పాసు పుస్తకాలు ఉపయోగపడతాయని చెప్పారు.
భూ యజమానుల ఫొటోలతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయడం ద్వారా రైతుల హక్కులకు మరింత రక్షణ కల్పిస్తున్నామని తెలిపారు. గత పాలకులు ప్రజల ఆస్తులకు సంబంధించిన పత్రాలను కూడా వ్యక్తిగత ప్రచారానికి ఉపయోగించుకున్నారని విమర్శించారు.
రైతుల భూములకు భద్రత కల్పించడం, హక్కులను పరిరక్షించడం, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. ప్రభుత్వ రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను రైతులు ఆనందంగా స్వీకరిస్తున్నారని తెలిపారు.

