స్థానిక సమరానికి సై అంటున్న జగన్!
స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని వైసీపీ శ్రేణులకు పిలుపు... మరో ఏడాదిలో పాదయాత్ర ప్రారంభిస్తానని వెల్లడి.. ఆ తర్వాత ఎన్నికల్లో విజయం మనదేనని ధీమా.. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందన్న జగన్.. వాటిని ఎదుర్కొనేందుకు యుద్ధం చేద్దామని పిలుపు...

తాడేపల్లి, ఆగస్టు 19: స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. తాడేపల్లిలో జరిగిన రాజమండ్రి రూరల్ నియోజకవర్గ నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు.
మరో ఏడాదిలో తన పాదయాత్ర ప్రారంభమవుతుందని జగన్ పేర్కొన్నారు. ఆ తర్వాత జరిగే ఎన్నికల్లో విజయం వైసీపీదేనని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల మధ్య ఉంటూ క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని జగన్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో ఆ ప్రభావం కనిపిస్తుందని వ్యాఖ్యానించారు.
రాబోయే రాజకీయ పోరాటాలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని, ప్రజా సమస్యలపై పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయాలని జగన్ పిలుపునిచ్చారు.

